పూణెలో ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో మలుపు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణె ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. తొలుత డెలివరీ ఏజెంట్ తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసిన యువతి, తాజాగా తన వాంగ్మూలాన్ని మార్చింది. ఆ వ్యక్తి డెలివరీ ఏజెంట్ కాదని, తన స్నేహితుడేనని అంగీకరించి పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహితుడిపై కోపంతోనే తప్పుడు కేసు పెట్టానని ఆమె పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఆ రోజు జరిగిన లైంగిక చర్యకు తాను సిద్ధంగా లేనప్పటికీ స్నేహితుడు బలవంతం చేశాడని యువతి పేర్కొందన్నారు. కోపంతో అతనిపై అత్యాచారం కేసు పెట్టినట్టు చెప్పిన ఆమె, తన మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నట్లు వెల్లడించారు.

దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. యువతి నివాసంలో బలవంతంగా ప్రవేశించిన వ్యక్తి ఎలాంటి ఆనవాళ్లు లేవని, మత్తు స్ప్రే వాడలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేసులో కీలకంగా మారిన సెల్ఫీ కూడా పరస్పర అంగీకారంతో తీసుకున్నదేనని గుర్తించారు. అంతేగాక, ఫొటోను ఎడిట్ చేసి బెదిరింపు సందేశాన్ని యువతే టైప్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది.

మొదట ఆమె చేసిన ఫిర్యాదులో, బుధవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో డెలివరీ ఏజెంట్ రూపంలో వచ్చిన వ్యక్తి ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఆధారంగా పోలీసులు పెద్దఎత్తున సిబ్బందిని రంగంలోకి దింపి, వందలాది సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కానీ ఆమె వాంగ్మూలం మారడంతో విచారణ దిశ పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం ఈ కేసును పలు కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, తదుపరి చర్యలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Read More : మోదీ యుద్ధం ఆపేశాడు: ఖర్గే విమర్శ

One thought on “పూణెలో ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో మలుపు

Comments are closed.