ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కీలకంగా పనిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014లో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల మేరే జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం వాటి పొడవు 5,200 కిలోమీటర్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు జాతీయ రహదారి కనెక్షన్ ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి అనేది పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యవసరమని, అనుసంధానం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని వివరించారు.
ఈ సందర్భంగా వాజ్‌పేయి హయాంలో ప్రవేశపెట్టిన ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్టును గుర్తుచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దానిపై వ్యతిరేకంగా మాట్లాడి ప్రాజెక్టును నిలిపివేసిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రోడ్డు మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు కేటాయించి దేశాభివృద్ధిలో కీలకంగా పని చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్-శ్రీశైలం మార్గాన్ని విస్తరించేందుకు పనులు ప్రారంభించామన్నారు. అలాగే హైదరాబాద్-విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారి కోసం చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి వివరించారు.
ఈ అభివృద్ధి పనులతో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More : పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం..

One thought on “తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగవంతం”
Comments are closed.