తెలంగాణ ఆర్థిక సంక్షోభం: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా దెబ్బతీసిందని ఎద్దేవా చేశారు. కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత మరోసారి బయటపడిందని విమర్శించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండానే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండానే, విద్యార్థులకు సరైన భోజనం ఇవ్వకుండానే అప్పులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వ్యాఖ్యానించారు.

అప్పుల్లో తెలంగాణ – లోటు బడ్జెట్‌తో ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడే నెలల్లో ఆర్థిక పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ అన్నారు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోగా, అప్పులు భారీగా పెరిగాయని తెలిపారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయం కూడా తీవ్రంగా పడిపోయి, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలైందని తెలిపారు.

నిధులు ఎటు పోతున్నాయి?

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతీ రోజూ అప్పులు తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఇది వార్షిక లక్ష్యంలో 37.5 శాతం అని తెలిపారు. “ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు, ఈ పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రణాళిక ఏంటో స్పష్టంగా వెల్లడించాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read More : షటిల్‌కాక్ తీసే ప్రయత్నంలో బాలుడు మృతి

2 thoughts on “తెలంగాణ ఆర్థిక సంక్షోభం: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Comments are closed.