మంత్రి పొంగులేటి–హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం

రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాదోపవాదాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మరింత రగిలిపోతోంది. తాజాగా ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు.

బీఆర్ఎస్ ఆరోపణలు పచ్చిబూతు:
కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి కేబినెట్ అనుమతులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది పచ్చిబూతు అని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం చేశారో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా ఉంది. నివేదికలోని అంశాలను అసెంబ్లీతో పాటు ప్రజల ముందుంచుతాం” అని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీలో చర్చిస్తాం:
సీఎం రేవంత్ రెడ్డి ముందే అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చిస్తామని ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. “బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని తెలిపారు.

బీఆర్ఎస్‌పై ఎద్దేవా:
“అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ పెడితే బీఆర్ఎస్ నేతలు ఉతికారేస్తామంటున్నారు. ఏం ఉతికికారేస్తారు బట్టలా?” అని మంత్రి పొంగులేటి వ్యంగ్యంగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మామ, అల్లుడు కూర్చొని పిల్లర్లను సరిచేస్తారా అని ఎద్దేవా చేశారు.

హరీష్ రావు ప్రతిస్పందన:
ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను పూర్తిగా “ట్రాప్” అని అభివర్ణించిన ఆయన, “కేసీఆర్ కేవలం ముఖ్యమంత్రి బాధ్యతను నిర్వర్తించారు. దాంట్లో రాజకీయ జోక్యం ఎక్కడుంది?” అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి అవలంబిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.

Read More : ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ వాడాలి

One thought on “మంత్రి పొంగులేటి–హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం

Comments are closed.