తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఓ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ్లకంట జగదీశ్ రెడ్డి స్ట్రాటజీ లోపంతో కాంగ్రెస్ ట్రాప్‌లో పడినట్లు కనిపిస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
నిజానికి, జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పెద్దగా తప్పేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. “సభ అందరిది, అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్ ఉంటారు. అది ఆయన వ్యక్తిగతం కాదు” అనే వ్యాఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద వివాదంగా మార్చింది. మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు నేతలు దీన్ని పెద్దగా లేవనెత్తారు.
సభలో ప్రసంగించేటప్పుడు జగదీశ్ రెడ్డి మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. గవర్నర్ ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన తన వ్యంగ్యాస్త్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అప్పట్లో మంత్రి కోమటి రెడ్డి ఆయన మాటల్లో అడ్డుపడి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో జగదీశ్ రెడ్డి, “తాను ఏమి తప్పు చేశానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతానంటూ” తన ప్రసంగాన్ని అర్థంతరంగా ఆపారు. అదే సమయంలో ఆయన ఆవేశానికి గురై తన చేతిలో ఉన్న నోట్స్‌ను బల్లపై విసిరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌ను బెదిరించారని ఆరోపించారు.
అప్పుడైనా జగదీశ్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఉండాల్సింది. స్పీకర్ జోక్యం చేసుకుని “మీరు సీనియర్ సభ్యులు, పదేళ్లు మంత్రిగా పనిచేశారు. మీరే సహనంగా ఉండాలి” అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మాటలు జగదీశ్ రెడ్డిని మరింత ఆగ్రహానికి గురి చేశాయి.
“ఏ సంప్రదాయాన్ని తాను ఉల్లంఘించానో చెప్పండి, ఆ తర్వాత మాట్లాడతా” అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే తర్వాత వివాదానికి దారితీశాయి. “సభ అందరిదే.. సమాన హక్కులు అందరికీ ఉంటాయి.. పెద్దమనిషిగా స్పీకర్ ఉన్నారని, అది ఆయన వ్యక్తిగతం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుని స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద రగడ సృష్టించింది. ఈ పరిణామాలతో జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
