తెలంగాణ మంత్రివర్గ కీలక నిర్ణయాలు – విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్

Revanthreddy

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.

బీసీల రిజర్వేషన్ల పెంపు

బీసీల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 37% బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచేందుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ఆమోదించింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి వేర్వేరు తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఎస్సీ వర్గీకరణపై చట్టానికి సన్నాహం

ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన సవరణ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక విధానం

తెలంగాణ పర్యాటక విధానం 2025-30కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఐదేళ్లలో కనీసం ₹15,000 కోట్ల పెట్టుబడులు రాబట్టి, 3 లక్షల ఉద్యోగాలను సృష్టించేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

పారా ఒలింపిక్స్ విజేతకు గౌరవం

2024 పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న దీప్తికి తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనున్నట్లు ప్రకటించారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు.

నూతన ఉద్యోగ నియామకాలు

కొత్తగా 361 రెవెన్యూ డివిజన్ & మండల పోస్టులు, 330 గురుకుల ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ కీలక నిర్ణయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, పర్యాటక అభివృద్ధి, ఉద్యోగ నియామకాలపై తమ దృష్టిని మరింత కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది.

Read More