బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్‌రావు, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం.
ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా హైదరాబాద్ లేదా వరంగల్‌లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభంకానున్నాయి. గత బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు మాత్రమే హాజరైన కేసీఆర్, ఈసారి పూర్తిస్థాయిలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా SLBC, కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై సభలో కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారని పార్టీ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తుండగా, బీఆర్ఎస్ అధినేత సభకు హాజరుకావట్లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ కార్యకలాపాలకు దూరంగా కేసీఆర్?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చాలా దూరంగా ఉంటూ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఆయన కేవలం మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రజలకు మరింత అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించగా, పార్టీ ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు.

One thought on “ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం – అసెంబ్లీ వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం”
Comments are closed.