మూడు నెలల్లో టీడీఆర్ బాండ్లపై పూర్తి స్పష్టత: మంత్రి నారాయణ

narayana minister

టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, తణుకుల్లో అనేక నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై అసెంబ్లీలో (AP Assembly Session) సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వచ్చే మూడు నెలల్లో వీటిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు.

విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా జారీచేశారని, తణుకులో రూ.63.24 కోట్ల విలువైన స్థలాన్ని రూ.754 కోట్లకు బాండ్లుగా మార్చినట్లు తెలిపారు. అలాగే తిరుపతిలో రూ.170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేయడం ద్వారా భారీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.

965 టీడీఆర్‌లు పెండింగ్‌లో

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 965 టీడీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో మాత్రమే 266 టీడీఆర్‌లు అటకెక్కాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల కారణంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల పాటు కొత్త టీడీఆర్ బాండ్ల జారీని నిలిపివేశామని తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ ముగించుకుని తగిన చర్యలు తీసుకుంటామని నారాయణ తెలిపారు.

రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్‌పై స్పష్టత

అలాగే అసెంబ్లీలో రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులపై వివరణ ఇస్తూ, 2007లో ఎంఐజీ ఇళ్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని మంత్రి తెలిపారు. అనంతపురం, కర్నూలులో ప్రాజెక్టులు పూర్తయినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల రద్దుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.

పెండింగ్‌లో ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్‌ల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Read More