కేటీఆర్ కీలక ప్రకటన: అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాదయాత్ర

KTR

తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం సూర్యాపేటలో కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడం కోసం వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

సూర్యాపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, “సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే అధికారం,” అని ధీమా వ్యక్తం చేశారు.

మరోసారి కేసీఆరే సీఎం
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “మరోసారి కేసీఆరే సీఎం అవుతారు. రాష్ట్ర బడ్జెట్‌లో పథకాల అమలుకు సరైన నిధులు కేటాయించలేదు. రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి వెళ్లి అడగాలి,” అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ధనం ఢిల్లీకి తరలుతోంది
తెలంగాణలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాల్లో రాష్ట్ర ధనం పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం దిగుమతిలో నల్లగొండను నంబర్ వన్‌గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

ఎస్ఎల్బీసీలో విషాదం – మంత్రులపై మండిపాటు
ఎస్ఎల్బీసీలో ఘోర విషాదం జరిగినప్పటికీ మంత్రులు చేపల కూర తింటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. “కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్పై ద్వేషంతో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే,” అని విమర్శించారు.

అంతేగాక, “రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్ అని చెప్పిన మజ్లిస్ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే దమ్ముంది?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read More

One thought on “కేటీఆర్ కీలక ప్రకటన: అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాదయాత్ర

Comments are closed.