పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

YSRCP MLC Duvvada

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు దువ్వాడపై పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీస్‌స్టేషన్‌లో జనసేన నాయకులు దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

గుంటూరులోని పాలెం పోలీస్‌స్టేషన్, విజయనగరం, అవనిగడ్డ, మచిలీపట్నం పోలీస్‌స్టేషన్లతో పాటు కోనసీమ జిల్లాలోనూ జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు స్పందించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఇక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు మాత్రం తగ్గడం లేదు. గతంలో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిపై కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు.

దువ్వాడ శ్రీనివాస్‌పై నమోదు అయిన కేసుల నేపథ్యంలో ఆయన అరెస్టు తప్పదనే వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు తీవ్ర నిరసన తెలియజేయడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Read More

One thought on “పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

Comments are closed.