తమిళనాడులో రుణాల వసూలు పేరుతో జరుగుతున్న బలవంతపు చర్యలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదం ముద్ర వేశారు. రుణగ్రహీతల హక్కులను పరిరక్షించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా తమిళనాడు శాసనసభ ఆమోదించిన తమిళనాడు రుణ సంస్థల (బలవంతపు చర్యల నివారణ) బిల్లు, 2025 గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం రుణ సంస్థలు లేదా వాటి ఏజెంట్లు రుణగ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకునే హక్కు ఉండదు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా, రుణ సంస్థల వేధింపుల కారణంగా ఎవరు ఆత్మహత్యకు పాల్పడినా, బాధ్యులపై భారతీయ న్యాయసంహిత 2023లోని సెక్షన్ 108 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు నమోదు చేస్తారు.
ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… రుణాల రికవరీ పేరుతో అనైతిక పద్ధతులు అవలంబిస్తూ కొన్ని సంస్థలు పలు కుటుంబాలను తీవ్ర సంక్షోభానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. ఇలాంటి దోపిడీ పద్ధతుల నుంచి ప్రజలను రక్షించేందుకు చట్టబద్ధమైన మంజూరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.
Read More : Honeymoon : దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు

One thought on “తమిళనాడులో రుణాల రికవరీ దౌర్జన్యాలకు చెక్”
Comments are closed.