ఇండోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు వరుసగా షాకింగ్ విషయాలను బయటకు తీసుకుంటున్నారు. రాజా భార్య సోనమ్ రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోనమ్ బతికే ఉండేందుకు, ఆమె స్థానంలో మరో మహిళను హత్య చేసి తన మృతిగా చూపించి పరారవ్వాలని కుట్ర రచించారు.
ఫిబ్రవరిలోనే హత్యకు సన్నాహాలు
పోలీసుల కథనం ప్రకారం, రాజాను హత్య చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సోనమ్, రాజ్ కుష్వాహా కలిసి ప్లాన్ సిద్ధం చేశారు. మొదట సోనమ్ అదృశ్యమైపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. నదిలో పడిపోయినట్లు నమ్మించాలన్న ఆలోచన కూడా చేశారు. చివరికి అస్సాంలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
మే 19న రాజా, సోనమ్ అస్సాం చేరుకున్నారు, మే 23న రాజ్, ఆకాష్, విశాల్ లు రాజాపై దాడి చేసి షిల్లాంగ్ లోని వైసాడాంగ్ జలపాతం వద్ద దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు. హత్య అనంతరం రక్తపు మరకలు దాచేందుకు రెయిన్‌కోట్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
పరారైన సోనమ్.. ట్రేస్ చేసిన పోలీసులు
హత్య అనంతరం సోనమ్ తొలుత బురఖా ధరించి పోలీస్ బజార్ వరకు వెళ్లి, అక్కడి నుంచి టాక్సీలో గువాహటి చేరింది. అక్కడి నుంచి బస్సుల్లో సిలిగురి, పాట్నా, ఆరా మీదుగా లక్నోలోకి వెళ్లి చివరకు ఇండోర్ చేరుకుంది. ఈ ప్రయాణమంతా అనుమానం రాకుండా ఉండేందుకు అపహరణ డ్రామా ఆడాలని రాజ్ సూచించినట్లు వెల్లడైంది.
అయితే మేఘాలయ పోలీసులు అప్రమత్తమై ఆమెను పక్కాగా ట్రేస్ చేశారు. యూపీలో ఆకాశ్ అరెస్ట్ కావడంతో రాజ్ కంగారుపడి, సోనమ్‌కు కొత్త స్క్రిప్ట్ చెప్పాడు. కానీ, పోలీసులు ముందస్తుగా ముఠా అందరినీ గుర్తించి, ఘాజీపూర్‌లో సోనమ్ ను పట్టుకున్నారు.
కేసులో చార్జిషీట్‌కు సిద్ధం అయిన పోలీసులు
మేఘాలయ ఎస్పీ సయీమ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసి, అన్ని ఆధారాలు సేకరించి హత్యకు సంబంధించిన మార్గాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయనున్నారు. నిర్దేశిత 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను ఇప్పటికే ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Read More : హనీమూన్ హత్య కేసులో మరో షాకింగ్ నిజం

One thought on “Honeymoon : దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు”
Comments are closed.