సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బాల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా వైరల్ అవుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి కలుగుతోందని ఆయన తెలిపారు.
ప్రత్యేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు.
బాల్మూరి వెంకట్ ఫిర్యాదు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్‌పై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 353(2) (ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు), సెక్షన్ 352 (ఉద్దేశపూర్వక అవమానం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More : సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన సీపీఆర్వో గుర్రం మల్సూర్

One thought on “బీఆర్ఎస్ నేతపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్య”
Comments are closed.