ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్న తరుణంలో, లబ్ధిదారుల సౌకర్యార్థం మరో కీలక మార్గాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాలు సహా అన్ని రోజులూ రేషన్ షాపులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
విజయవాడలో గురువారం నిర్వహించిన ట్రయల్ రన్ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గతంలో రేషన్ వాహనాల కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు పరిష్కారమయ్యాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో షాపులు తెరవడం వల్ల దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, పనివాళ్లు కూడా రేషన్ సౌకర్యాన్ని సులభంగా పొందగలరని పేర్కొన్నారు.
“ప్రజల సౌలభ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత. ప్రతి నెలా మొదటి పదిహేను రోజులు, ఆదివారాలు సహా, రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే చర్య,” అని మంత్రి మనోహర్ వివరించారు.
అలాగే వృద్ధులు, దివ్యాంగులు షాపులకు రాలేని పరిస్థితిలో ఉంటే, వారి ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పట్టణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారాంతాల్లోనే సమయం దొరికే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ విధానం అధికారికంగా జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
Read More : ఆపై కోనసీమ పర్యటనకు సీఎం షెడ్యూల్ ఖరారు
