బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బీసీ సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా కృషి చేసిందా? అని ప్రశ్నించారు. బీసీల కోసం పోరాడే హక్కు లేకుండానే ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
గజ్వేల్ పట్టణంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, “కవితకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, వెంటనే కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవిని ఓ బీసీ నాయకుడికి అప్పగించాలని డిమాండ్ చేయాలి” అని సవాల్ విసిరారు. అంతేకాకుండా, శాసనసభ ప్రతిపక్ష నేత పదవిని బీసీలకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. శాసన మండలిలోనూ బీసీలకు కీలక పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు.
ఈటెల రాజేందర్‌ను మధ్యలోనే మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీలను చిన్నచూపు చూసినట్లే కాదా? అని ప్రశ్నించారు. “కేసీఆర్ కుటుంబానికి పదవులు అవసరమా? బీసీలకు పదవులు ఇచ్చే ఆలోచన ఉందా?” అంటూ రఘునందన్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మరో సవాల్ చేస్తూ, “ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో జరిగిన మీ చర్చలో, బీసీలపై నేను పేర్కొన్న విషయాలను మీరు ప్రస్తావించగలరా?” అని కవితను ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ ఒక మహిళా నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ, బీఆర్ఎస్ పాలనలో మొదటి ఐదేళ్లలో ఒక్క మహిళను కూడా మంత్రిగా చేర్చలేకపోయినదే ఈ దేశంలో ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కారే అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీపై విమర్శలు చేయడానికి ముందుగా, బీఆర్ఎస్ నేతలు తమ పాలనలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. “ఇతర పార్టీల వైపు వేలెత్తి చూపించే బదులు, ముందుగా మీ తప్పులను చూసుకోండి” అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రఘునందన్ రావు సూచించారు.

One thought on “కేసీఆర్ ప్రభుత్వంపై రఘునందన్ రావు ఆగ్రహం – కవితకు మాస్ సవాల్”
Comments are closed.