రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 నెలలుగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సన్నాహాలు
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం వచ్చే వారంలో ప్రారంభం కానుందని చెప్పారు. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ‘తులం బంగారం’ పథకంపై స్వల్ప ఆలస్యం జరిగిందని వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడ తగ్గకుండా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యమైనా నెరవేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.

One thought on “మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన”
Comments are closed.