ఢిల్లీ కరోల్ బాగ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలోని ప్రసిద్ధ విశాల్ మెగా మార్ట్‌లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు మంటలు చెలరేగిన సమయంలో లిఫ్ట్‌లో చిక్కుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6:44 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలయ్యాయి. మొదట మాల్ సిబ్బంది అక్కడే ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేయడానికి యత్నించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో స్టోర్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ 13 ఫైరింజన్లను ఘటన స్థలానికి తరలించి మంటల్ని అదుపు చేయడానికి చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సుమారు రాత్రి 9 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే భవనంలో ఇంకా వేడి తగ్గకపోవడంతో కూలింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, 6 ఫైరింజన్లు అక్కడే ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Read More : పూణెలో ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో మలుపు

One thought on “ఢిల్లీ కరోల్ బాగ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం

Comments are closed.