పులివెందుల, ఒంటిమిట్లలో వైసీపీ కుట్రలు – బీటెక్ రవి

పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు కుయుక్తులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం పులివెందులలో మీడియాతో మాట్లాడిన ఆయన, సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఏపీ నలుమూలల నుంచి సాక్షి రిపోర్టర్లు వచ్చి, తాము చేసినట్లుగా దాడులు నాటకాలు వేసి, ఆ నిందను తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అంతేకాక, స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీకి చెందిన వారినే నామినేషన్ వేయించారని, అందులో వైఎస్ కుటుంబ బంధువులే ఉన్నారని బీటెక్ రవి ఆరోపించారు. కుట్రలు చేస్తూ తమపై తప్పుడు ఆరోపణలు మోపే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ఏదైనా జరిగినా తమ పార్టీపై నింద వేయడం సరికాదని హెచ్చరించారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఎంపీ అవినాష్ రెడ్డి మెప్పు పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల షిఫ్టింగ్ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని, ఒకే గ్రామ పంచాయతీలో ఓటర్లను మారుస్తే కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచారని, ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఉప ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read More : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: అల్లూరి జిల్లాకు సీఎం