ప్రణయ్ హత్య కేసు: నేడు తుది తీర్పు, ఉత్కంఠలో కుటుంబ సభ్యులు

Perumalla Pranay murder case

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు, ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పును ఇవాళ (సోమవారం) వెలువరించనుంది. ఈ తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

2018లో జరిగిన అమానుష హత్య

2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రణయ్ భార్య అమృత గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా, దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి అతడిని హత్య చేశారు. తన కూతురు కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

కేసు విచారణలో కీలక మలుపులు

ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఏ-1 నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ జిల్లా ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను వేగవంతం చేసింది. సుమారు 102 మంది సాక్షులను విచారించింది. మొత్తం 1600 పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో జరిగిన విచారణలో ఎనిమిది మంది నిందితుల పాత్రను నిర్ధారించారు.

తుది తీర్పుపై ఉత్కంఠ

కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించనుంది. నిందితులపై ఉన్న సాక్ష్యాధారాలను పరిగణించి తగిన శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు, న్యాయ నిపుణులు, సామాజిక వర్గాలు ఈ తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

కేసులో ప్రధాన నిందితులు

కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో నిందితులుగా పేర్కొన్న వారు:

  • ఏ1 – తిరునగరు మారుతీరావు (ఆత్మహత్య)
  • ఏ2 – సుభాష్ శర్మ (బీహార్)
  • ఏ3 – అజ్గర్ అలీ
  • ఏ4 – అబ్ధుల్ బారీ
  • ఏ5 – ఎం.ఏ కరీం
  • ఏ6 – తిరునగరు శ్రవణ్ కుమార్
  • ఏ7 – శివ
  • ఏ8 – నిజాం

సుభాష్ శర్మ, అజ్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉండగా, మిగిలిన ఐదుగురు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.

అందరి దృష్టి తీర్పుపై

నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో, నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారు? న్యాయస్థానం ఈ హత్య కేసుపై ఎలా స్పందిస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవాళ లభించనుంది.

Read More

One thought on “ప్రణయ్ హత్య కేసు: నేడు తుది తీర్పు, ఉత్కంఠలో కుటుంబ సభ్యులు

Comments are closed.