విశాఖపట్నం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం రాత్రి తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపాయి.
వివరాల్లోకి వెళితే… రాజీవ్‌నగర్‌లో గత 35 ఏళ్లుగా నివసిస్తున్న గంపాల యోగేంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి (58)లు గుర్తుతెలియని దుండగుల చేతిలో మృతిచెందారు. యోగేంద్రబాబు డాక్‌యార్డులో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి. ఇటీవలే ఈ దంపతులు హైదరాబాద్‌కి వెళ్లి గురువారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నట్లు సమాచారం.
అయితే శుక్రవారం రాత్రి వరకూ ఇంటి తలుపులు మూసే ఉండటంతో, ఫోన్లకు స్పందించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వారి బంధువు ఒకరు ఇంటికి వచ్చి చూస్తే రెండు వైపులా తాళాలు వేయబడి ఉండటాన్ని గమనించి, వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది.
సౌత్ ఏసీపీ త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు పోలీసు బృందంతో అక్కడికి చేరుకుని తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. హాల్లో యోగేంద్రబాబు, బెడ్‌రూమ్‌లో లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి, వారు మరణించినట్లు నిర్ధారించారు.
మృతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడి ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దల క్రితం ఈ దంపతులు కులాంతర వివాహం చేసుకున్నారు.
క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించగా, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రోజే లేదా ఆ తర్వాతి రోజే ఈ హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : విజయవాడలో సిమి అనుమానితుల కదలికలు..
