ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటుచేసే ప్రణాళికను వెల్లడించారు. 2026 మార్చి 16 నాటికి విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు నివాసాన్ని మ్యూజియంగా మారుస్తామని తెలిపారు.
మెమోరియల్ సెంటర్ ఏర్పాటు
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మారక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇదే సందర్భంలో, ఆయన స్వగ్రామమైన పడమటిపల్లిలో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవన నిర్మాణానికి సీఎం భరోసా ఇచ్చారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు.
125వ జయంతి ఉత్సవాలు
ఈ ఏడాది పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టామని, వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతినెలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, పొట్టి శ్రీరాములు పేరిట మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
“తెలుగు భాషా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి” అని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

One thought on “పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన”
Comments are closed.