ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల మొబైల్ ఫోన్ వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నమవుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించాల్సిన అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగం అనవసరమని స్పష్టం చేశారు.
సభ గౌరవాన్ని కాపాడాలి
అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులు పూర్తి క్రమశిక్షణ పాటించాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు. అత్యవసరమైతే సభ హాలులో కాకుండా బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని స్పష్టంగా పేర్కొన్నారు. సభా కార్యకలాపాల సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం సభా గౌరవానికి భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు.
సభ్యులకు స్వీట్ వార్నింగ్
సభలో మొబైల్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన జామర్‌లపై కొంతమంది సభ్యులు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. “మనమే జామ్ చేసుకోకుండా జామర్‌లపై వంక పెట్టడం సరికాదు” అంటూ చురకలంటించారు. సభ్యులు స్వీయ క్రమశిక్షణ పాటించి, సభా గౌరవాన్ని నిలబెట్టాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు.
కఠిన చర్యల హెచ్చరిక
ఈ తరహా చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీలో సభ్యులు సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు.

One thought on “అసెంబ్లీలో సభ్యుల మొబైల్ వినియోగంపై డిప్యూటీ స్పీకర్ కఠిన హెచ్చరిక”
Comments are closed.