పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసిన పవర్‌ఫుల్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రసంగం చూసి భావోద్వేగానికి గురయ్యానని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు.
‘ప్రియమైన నా తమ్ముడు పవన్ కల్యాణ్… జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నువ్వు ఇచ్చిన స్పీచ్ చూసి ఫిదా అయ్యాను. సభలో పాల్గొన్న అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగిపోయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జనసైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.
హాట్ టాపిక్‌గా పవన్ స్పీచ్
గత గురువారం పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం విశేషంగా చర్చనీయాంశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ మాట్లాడిన అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.
స్పీచ్ ప్రారంభంలోనే తెలంగాణ గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఆంధ్ర గడ్డ మీద ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయడం విశేషం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ ప్రాంతాన్ని కొనియాడారు.
కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన స్థితిలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అభిమానుల ప్రేమతోనే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని పవన్ తెలిపారు. జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్న ఆయన.. ‘నాకు గద్దర్ అంటే అభిమానం. నేను దారథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాను. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా అనే మాటు నిజం చేశాం’ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు.

2 thoughts on “పవన్ కల్యాణ్ స్పీచ్‌పై చిరంజీవి స్పందన”
Comments are closed.