జనసేన 12వ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ భాషపై వ్యతిరేకతను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, “అన్ని భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమిళనాడు హిందీని వద్దంటోంది, అయితే అలాగైతే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదు,” అని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు కాస్త ఘాటుగా స్పందించారు. హిందీ భాషపై వ్యతిరేకత వ్యక్తం చేయడం ద్వేషానికి సంకేతం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమే,” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. “ఎవరైనా పవన్‌కు చెప్పండి ప్లీజ్” అంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ తన నిరసనను తెలియజేశారు.
ఇదే అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇటీవల హిందీ వ్యతిరేక ధోరణిని స్పష్టం చేశారు. “తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వడంలో తాము వెనుకడగు వేయబోమని, హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దే ఆలోచనను అంగీకరించబోమని” స్టాలిన్ పేర్కొన్నారు.
ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భాషలకు సంబంధించి గల ఈ వివాదం త్వరలో ఏమేరకు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది.
