ఉద్యోగాల ఆశతో విదేశాలకు వెళ్లి మానవ అక్రమ రవాణా ముఠాల బారిన పడ్డ తెలుగు యువకులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపించారు. బాధితుల్లో ఒకరి తల్లి కన్నీటి వేడనతో స్పందించిన పవన్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను రంగంలోకి దించారు. విజయనగరం జిల్లాకు చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ పవన్ కల్యాణ్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు సహా ఎనిమిది మంది యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని, ప్రాణాలపై భయం ఉందని తెలిపింది. ఏజెంట్ మోసానికి గురై ముఠాల చెరలో చిక్కుకున్నారన్న ఆమె, వారిని రక్షించాలని కన్నీటి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ముఠాల ధోరణిని వివరించి, బాధితులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్ చొరవపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరితగతిన బాధితుల స్థితిగతులు తెలుసుకుని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఈ చర్యకు పౌరసమాజం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read More : తల్లితో ముఖాముఖి సమావేశమైన లోకేశ్

One thought on “విదేశాల్లో చిక్కుకున్న యువకుల కోసం పవన్ కల్యాణ్ చొరవ”
Comments are closed.