హిందీపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: విశ్లేషణ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తనకే తెలియదనే మాట చాలా కాలం నుండి ఉంది. ఒక విషయం పై ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తుంటారు అని చాలామంది ప్రజల్లో ఉన్న భావన. ఈ మధ్యకాలంలో హిందీ భాషపై దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వానికి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశ భాష/రాజ్య భాష హిందీ కావచ్చు. అంతమాత్రాన హిందీ భాషను బలవంతంగా రుద్దడం సరికాదని స్టాలిన్ ప్రభుత్వ వాదన. ఇష్టమైన వాళ్ళు నేర్చుకుంటారు అంతే కానీ బలవంతంగా రుద్దడం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యంగా స్టాలిన్ చెప్పదల్చుకున్న విషయం. ఈ వివాదం కొనసాగుతుండగానే పవన్ కల్యాణ్ దీనిపై తనదైన స్టైల్ లో మాట్లాడుతూ సినిమాలు హిందీలోకి డబ్ చేస్తారు, డబ్బులు మాత్రం కావాలి.. హిందీ అమలుచేయమంటే మాత్రం కుదరదంటారు అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో భాగమైన పవన్ పార్టీ తప్పక ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న సందేహం కూడా కొందరిలో కలిగింగింది. ఎందుకంటె ఇదే పవన్ అధికారం లో లేనప్పుడు బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హిందీ భాష మాపై ఎలా రుద్దుతారు, బీజేపీ హిందుత్వం అంటుంది, అది హిందుత్వ పార్టీ కాదు, హిందీ పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్చించారు. ఇప్పుడు తన వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా తనే హిందీ భాషపై ప్రేమను ఒలకబోయడం పవన్ అవివేకానికి, మూర్ఖత్వానికి ఉదాహరణగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజాగా శుక్రవారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు ,మేధావులు, సామాన్యజనం సైతం మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ‘మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ’ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్ ఇప్పుడు ‘ఏ మేరా జహా’ అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోందని సమాచారం. ఇక #POLITICALJOKERPK అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్ కు కౌంటర్ గా దాదాపు పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి.

ఇవాళ (శనివారం) ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ చేసిన కామెంట్స్ ని చేర్చి ‘ఈ range కి అమ్ముకోవడమా ….ఛి… ఛి… #justasking’ అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కు చాలామంది సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన పోస్టును షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ భాషపై గతంలో పవన్ పెట్టిన ట్వీట్లు, మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్ అని పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, హిందీని నేర్చుకోవడం వేరు, బలవంతంగా రుద్దడం వేరు. హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడం ఉపయోగకరమే..కానీ అది ఎవరి ఇష్టాన్ని బట్టి వారు నేర్చుకుంటారు. అంతేకాని హిందీ భాషను కచ్చితంగా అమలు చేయాలని చెప్పడం ఏ మాత్రం సమంజసం కాదు.

హిందీ భాష వలన కనుమరుగైన ప్రాంతీయ/స్థానిక భాషలను ఒకసారి చూస్తే..
1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపాదిక ప్రకారం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకు అంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో డా. బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకైనా మంచిది ఉత్తరప్రదేశ్ ను నాలుగు భాగాలు చేయాలని అంబేడ్కర్ అప్పుడే సూచించారు. అంబేడ్కర్ భయపడినట్టే ఇప్పుడు జరుగుతోందనిపిస్తోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయిందని, అందుకే హిందీ భాషను రుద్దకండి అంటూ పలువురు విశ్లేషకులు కోరుతున్నారు.

Read More : లిక్కర్ స్కామ్: సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి