పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనల సందడి..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ కబ్జాలు, దందాలపై బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయన ప్రత్యేక యాత్ర చేపట్టబోతున్నారు. కలెక్టర్లు, జేసీల సమక్షంలో ప్రజలతో సమావేశమై సమస్యలు స్వయంగా తెలుసుకొని పరిష్కార మార్గాలను చర్చిస్తానని పవన్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా తొలుత కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు వెళ్లనున్నారు. భూ దందాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు, తక్షణమే అధికారులతో సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూకబ్జా బాధితులను ప్రత్యక్షంగా కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నట్టు పవన్ తెలిపారు.

ఇప్పటి వరకు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి ప్రాంతాల బాధితుల ఫిర్యాదులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఆరా తీశారు. ఇకపై భూసమస్యల పరిష్కారానికి తానే జిల్లాల్లో ప్రత్యక్షంగా ఉండబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కూటమి నేతలైనా అయినా భూ దందాల్లో ప్రమేయం ఉంటే ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తమ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Read More : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు