ఆరోగ్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రికి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవల జ్వరంతో బాధపడిన కేసీఆర్ పూర్తిగా కోలుకున్నా, వైద్యుల సూచన మేరకు మరికొన్ని పర్యవేక్షణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఐదు రోజులుగా నందినగర్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్, అనారోగ్యం మధ్యనే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ఇంట్లోనే సమావేశమై, వ్యూహాలు సిద్ధం చేశారు. బీఆర్ఎస్ సిద్ధతపై సమీక్ష నిర్వహించి, నేతలకు కీలక సూచనలు చేసినట్టు సమాచారం.

అంతేగాక, బనకచర్ల ప్రాజెక్టు విషయమై కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read More : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ఈడీ కేసు

One thought on “ఆరోగ్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రికి కేసీఆర్

Comments are closed.