రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సమస్య పరిష్కారానికి లక్షా 55 వేల ఫారం పాండ్‌ల (Farm Ponds) నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రకటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫారం పాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పల్లె పండుగ విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే (CM Chandrababu Naidu) ప్రధాన కారణమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటారని, ఆయన స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు. “దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. కష్ట సమయంలో ప్రజలు ఎన్డీయే కూటమికి అఖండ విజయాన్ని అందించారని” పవన్ గుర్తుచేశారు.
రాయలసీమలో నీటి సమస్యల పరిష్కారంపై దృష్టి
రాయలసీమలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మే నెలలోపుగా లక్షా 55 వేల నీటి కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాకాలంలో ఇవి నిండితే ఒక టీఎంసీ నీటిని సేకరించవచ్చని తెలిపారు. “శ్రీకృష్ణదేవరాయలు ఊహించినట్లుగా రాయలసీమను రతనాల సీమగా మార్చాలి. అభివృద్ధి కొందరికే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి” అని ఆయన పేర్కొన్నారు.
గ్రామసభలతో రికార్డు
ఒకే రోజు 13,326 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కార మార్గాలను నిర్దేశించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. “నిజమైన అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తులు అవసరం. సీఎం చంద్రబాబు గారి మార్గదర్శకత్వాన్ని అనుసరించి నాకు అప్పగించిన శాఖల్లో ఉత్తమ పనితీరును చూపించేందుకు కృషి చేస్తున్నాను” అని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మంది కూలీలకు ఉపాధి లభించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.9.5 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
రోడ్ల నిర్మాణంలో ప్రగతి
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా, ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. రూ.1,600 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
“లక్షా 55 వేల నీటి కుంటలు నిండితే భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉండదని, రాష్ట్ర అభివృద్ధిలో ఇవి కీలక భూమిక పోషిస్తాయని” ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

One thought on “మే నెలలోపు లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి చేయడం లక్ష్యం”
Comments are closed.