ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా, వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకువచ్చి, ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం, భవిష్యత్తులో వైద్య ఖర్చులు ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు పురుగుమందులు లేని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు, ప్రజలు ఈ దిశగా చైతన్యం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం లేని సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించిన సీఎం, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని, అవసరమైతే ఔట్‌సోర్సింగ్ సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో సిబ్బంది కొరత ఉన్నందున 150 పోస్టులను వెంటనే భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థుల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయన సూచించారు.
ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, మంత్రి సత్యకుమార్ యాదవ్, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది
