పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన అనుమానిత డ్రోన్ దాడి పెద్ద విషాదాన్ని మిగిల్చింది. మిర్ అలీ పట్టణంలోని ఈ దాడిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు, మృతులైన చిన్నారుల మృతదేహాలను ప్రధాన రహదారిపై ఉంచి నిరసన తెలిపారు.
ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
“మా పిల్లలను ఎవరు చంపారో మాకు చెప్పాలి. మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం” అంటూ స్థానిక గిరిజన పెద్ద ముఫ్తీ బైతుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వేవరకు మృతదేహాలను ఖననం చేయబోమని ఆయన హెచ్చరించారు. వందలాదిమంది ప్రజలు మిర్ అలీ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.
ఇంకా ఎవరు చేసిన దాడి అనుమానమే
ఈ దాడికి ఎవరు బాధ్యత వహించారన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. పాకిస్థాన్ సైన్యం నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. మిర్ అలీ ప్రాంతం పాకిస్థానీ తాలిబన్లకు కంచుకోటగా భావించబడుతోంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది.
ప్రభుత్వ స్పందన
ఈ దాడిని మంత్రివర్గ సభ్యుడు నాయక్ ముహమ్మద్ దవార్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. గత కొంతకాలంగా మిర్ అలీ, దాని పరిసర ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ప్రధాన స్థావరాలుగా మారిన నేపథ్యంలో ఈ దాడి మరింత కలవరం రేపుతోంది.
ఈ ఘటన పాకిస్థాన్‌లో అంతర్గత భద్రతా పరిస్థితులపై మరోసారి గంభీర ప్రశ్నలు వేస్తోంది. అమాయకుల ప్రాణాలను బలితీస్తున్న ఇటువంటి దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read More : మళ్లీ ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల పెరుగుదల.

One thought on “పాకిస్థాన్ డ్రోన్ దాడిలో చిన్నారుల మృతి”
Comments are closed.