తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండనున్నదని వెల్లడించింది.
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో త్వరలోనే వర్షం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాతావరణం ఇప్పటికే మేఘావృతంగా మారిపోయిందని, అక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశమున్నందున ప్రజలు రక్షిత ప్రదేశాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది.
Read More : హైదరాబాద్ మెట్రో ఛార్జీలలో 10% తగ్గింపు

One thought on “తెలంగాణకు వర్ష హెచ్చరిక”
Comments are closed.