జిల్లా పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, టీడీపీకి వెనుకబడిన వర్గాలే నిజమైన బలమని పేర్కొన్నారు. స్థానికుల సమస్యలను పరిశీలించామని, పేదల బాధలను స్వయంగా చూశామని తెలిపారు.
కొంతమంది జాలర్ల ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితం మెరుగుపడేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉన్నదన్నారు. గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల మద్దతుతో కూటమి విజయం సాధించిందని గుర్తు చేశారు. వీరి కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ హయాంలో తీసుకున్న రుణాల వివరాలు కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో జాలర్ల స్థితి మారిందని చెప్పారు. వేట విరామ కాలంలో మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. మొత్తం 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు.
“గత నాయకుల మాదిరిగా మేము కార్యాలయాల్లో కాకుండా నేరుగా మీ గ్రామాలకు వచ్చాం. మీ కష్టాలను నేరుగా తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నాం,” అని చంద్రబాబు స్పష్టం చేశారు. మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజల ఆదాయాన్ని పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో నాయకులు వస్తే చెట్లు నరికి, పరదాలు కట్టి తమ రాకను ముస్తాబు చేసేవారని విమర్శించారు.
Read More : జిల్లాలో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

One thought on “మత్స్యకారుల సేవలో కొత్త వెలుగు: ముఖ్యమంత్రి”
Comments are closed.