సింధూ జలాలపై భారత్ నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యతిరేక స్పందనలు

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఎదురు చర్యలకు దిగింది. భారత్ సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు సంకేతాలిచ్చిన తర్వాత, పాక్ రక్షణ మంత్రితో పాటు పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిలో ప్రతి నీటి చుక్క తమదని, నీటిని ఆపితే నదుల్లో రక్తం పారుతుందని హెచ్చరించారు.

అయితే, ఈ హెచ్చరికలపై పాకిస్థాన్ సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలోని ఆర్థిక సంక్షోభం, మౌలిక సదుపాయాల కొరతను ఎత్తిచూపుతూ వ్యంగ్య మీమ్స్, జోకులతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

“భారత్ నీళ్లు ఆపేస్తుందా? మాకైతే ఇప్పుడే నీటి సరఫరా లేదు”, “మమ్మల్ని చంపేస్తారా? మాకోసం మా ప్రభుత్వం చాలదా?” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. లాహోర్ గురించి మాట్లాడుతూ, “అక్కడ అరగంటలో ఏమీ మిగలదు” అంటూ చమత్కరించారు.

ఒక నెటిజన్ సబ్బు కళ్లల్లో పడిన ఫోటోను షేర్ చేస్తూ “భారత్ నీళ్లు వదులు” అని కామెంట్ చేయగా, మరొకరు గ్యాస్ కొరతను గుర్తు చేస్తూ “యుద్ధం చేయాలంటే రాత్రి 9కి ముందు ముగించాలి” అని వ్యంగ్యంగా చెప్పారు.

కాగితపు అట్టలతో తయారుచేసిన యుద్ధ విమానాల మీమ్స్‌ను షేర్ చేస్తూ పాక్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తున్నారు.

ఈ మీమ్స్, వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో పెరిగిన ఆర్థిక అసంతృప్తిని, సామాన్య ప్రజల భయాలను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

Read More : పాకిస్థాన్ కుటుంబానికి భారత్‌లో చికిత్స ఆగిపోయే ప్రమాదం

One thought on “సింధూ జలాలపై భారత్ నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యతిరేక స్పందనలు

Comments are closed.