మాజీ సీఎం జగన్‌ను ఇరుకున పెట్టే వ్యూహమేనా?

లిక్కర్ స్కాం కేసు రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పరిగణించబడే వ్యక్తులు అరెస్టు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.3,200 కోట్ల అవినీతి ఆరోపణలతో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), కేంద్ర ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడం అధికార వర్గాల వ్యూహాత్మక ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన సిట్, తాజాగా మాజీ సీఎంవో అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. వారితో పాటు, ప్రభుత్వానికి సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారత్ సిమెంట్స్ డైరెక్టరునూ రిమాండ్‌కు తరలించారు.

ఇక వీరి అరెస్టుతో “నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్?” అనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ బిగ్ బాస్ ఎవరు? అనే ప్రశ్నకు స్పష్టత లేకపోయినా, దిశ మాత్రం జగన్ వైపే చూపుతోంది. ప్రభుత్వం జగన్‌ను నేరుగా టార్గెట్ చేయడం కంటే, ఆయన అనుచరులను చుట్టుముట్టే వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటుండటం రాజకీయంగా కీలకంగా మారింది. మాజీ సీఎంను టచ్ చేయాలంటే, ఆయన కన్ఫిడెంట్ సర్కిల్‌ను కుదిపేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అనే అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.

అంతేకాక, లిక్కర్ స్కాంలో కమీషన్లు రాజ్ కసిరెడ్డితో పాటు ఇతరుల ద్వారా జగన్ వరకు చేరాయనే పరోక్ష సంకేతాల్ని సిట్ లీక్ చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి జగన్‌పై నేరుగా ఆధారాలు లభించకపోవడంతో, ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించకుండా విచారణను కొనసాగిస్తున్నారు.

ఇక నిందితులు జగన్ పేరు బయటపెట్టే అవకాశాలు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యూహం ఎటు సాగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా, ఈ స్కాంలో కీలకుల అరెస్టులతో రాజకీయంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : కేఏ పాల్‌ యుద్ధసామగ్రి విక్రయించే దేశాలను తీవ్రంగా విమర్శించారు.

One thought on “మాజీ సీఎం జగన్‌ను ఇరుకున పెట్టే వ్యూహమేనా?

Comments are closed.