ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణంలో జగన్‌కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడి మీద ప్రమాణం చేయగలరా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న లోకేశ్, గురువారం మీడియాతో మాట్లాడారు. “జగన్‌కి నిజంగా నేరం లేదంటే దేవుడిపై ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్” అని అన్నారు. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అలిపిరిలో అదే రీతిలో సవాల్ చేశానని గుర్తు చేశారు.
చట్టం ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు
లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. “ప్రజలు మమ్మల్ని గెలిపించింది అభివృద్ధి, సంక్షేమం కోసం. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు మాత్రం తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా అయినా చర్యలు తీసుకుంటాం. సాక్ష్యాధారాల ఆధారంగా చార్జిషీట్లు వేయబడతాయి” అని హెచ్చరించారు.
మద్యం కేసులో త్వరలో చార్జిషీట్
జగన్ పాలనలో జరిగిన మద్యం స్కాం విచారణ ముమ్మరమవుతోందని లోకేశ్ తెలిపారు. “మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్న ఈ కేసులో త్వరలో చార్జిషీట్ ఫైలవుతుంది. ఇది జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని సూచన” అని పేర్కొన్నారు.
ప్రధానితో భేటీ.. మోదీ సూచనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల తనకు జరిగిన భేటీపై లోకేశ్ స్పందించారు. “మోదీ గారు తన రాజకీయ అనుభవాన్ని నాకు పంచుకున్నారు. నాన్న నీడ నుంచి బయటకొచ్చి కష్టపడమన్నరు. యువత భవిష్యత్తు, కష్టపడితేనే ఎదుగుదల సాధ్యం” అని మోదీ మాటలను గుర్తు చేశారు.
అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి
“గత ప్రభుత్వ హయాంలో వెనుకబడ్డ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టేందుకు నూతన ప్రభుత్వం కృషి చేస్తోంది” అని లోకేశ్ తెలిపారు. “తల్లికి వందనం కార్యక్రమం 95 శాతం పూర్తైంది. జూలై 5 కల్లా మిగిలినది పూర్తి చేస్తాం. టీసీఎస్ కార్యాలయం విశాఖలో జూలై చివర్లో ప్రారంభమవుతుంది. అదే రోజు శాశ్వత భవనానికి శంకుస్థాపన జరుగుతుంది” అని వివరించారు.
ఉపాధి హామీ బిల్లులు, కేసుల ఎత్తివేత
“ఉపాధి హామీ పెండింగ్ బిల్లులుగా ఉన్న రూ.2000 కోట్లను క్లియర్ చేశాం. గత ప్రభుత్వంలో కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.
Read More : ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ రంగంలో గర్వకారణమైన గౌరవం
