గోదావరి జలాల వినియోగంపై బనకచర్ల ప్రాజెక్టును ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలకు తగిన స్పష్టతనిచ్చారు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘పోలవరం మినహా బనకచర్ల వద్ద మరే ప్రాజెక్టుకూ అనుమతులు లేవు. కేవలం వరద జలాలను మాత్రమే వినియోగించబోతున్నాం’’ అని తేల్చిచెప్పారు.
గోదావరి జలాల వాదనపై కౌంటర్
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ద్వారా గోదావరి జలాలను వేరే బేసిన్‌కు మళ్లిస్తే తమకు నష్టం జరుగుతుందని ఆరోపించడంపై చంద్రబాబు స్పందిస్తూ – ‘‘గోదావరి జలాలతోనే మీరు కాళేశ్వరం నిర్మించారు. అప్పుడు మేమెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. తెలుగువారు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. మేమెప్పుడూ తెలంగాణ ప్రజలతో ఘర్షణ పడలేదు’’ అని పేర్కొన్నారు.
ఘర్షణలు వద్దు.. అభివృద్ధి కోసం పోటీ ఉండాలి
‘‘ఇలాంటి అనవసర గొడవలతో ప్రజలను గందరగోళానికి గురిచేయకండి. నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినవాడిని. ఇప్పుడు మళ్లీ అదేమీ అడగలేను. మీరు ప్రాజెక్టులు నిర్మించండి, అభివృద్ధికి కృషి చేయండి. పోరాటాలు తర్వాత చూసుకోవచ్చు. మేము ఇచ్చిన హామీ డబుల్ ఇంజన్ సర్కార్ – దాని అర్థం రాష్ట్రం–కేంద్రం కలిసి అభివృద్ధి సాధించడమే’’ అని చంద్రబాబు వివరించారు.
తెలుగు జాతి గర్వించేదిగా పనిచేద్దాం
‘‘తెలుగు జాతిని దేశంలోనే ముందంజలో నిలిపే బాధ్యత మనందరిది. నేను ఎవరితోనూ వ్యక్తిగతంగా గొడవపడను. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు. కేవలం వరద నీటినే వినియోగిస్తాం. ఇది కేంద్రానికి కూడా తెలియజేశాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
Read More : తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం
