ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా స్వీకరించిన మంత్రి, వాటిపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన మన్నె సుబ్బారావు అనే వ్యక్తి సంచలనమైన ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు అడపా ప్రేమ్‌చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి రూ.1.20 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
తరువాత వారు మోసం చేసినట్టు తెలిసిందని, మెడికల్ సీటు కోసం ప్రశ్నించగా అప్పటి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి మరో రూ.2 కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని చెప్పడంతో తమను బెంగుళూరులోని రామయ్య మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి నకిలీ సీటు అలాట్‌మెంట్ లేఖను చూపించి మోసం చేశారని బాధితుడు వివరించారు. అంతేకాకుండా, సొమ్ము తిరిగి కోరితే బెదిరింపులకు గురవుతున్నామని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన మంత్రి లోకేష్, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తొలగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Read More : జులై 3న నెల్లూరుకు జగన్ పర్యటన ఖాయం

One thought on “ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్…”
Comments are closed.