సింగయ్య మృతి కేసులో జగన్‌కు హైకోర్టు ఊరట…

పల్నాడులో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో వచ్చే రెండు వారాల పాటు ఎటువంటి తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మంగళవారం నాడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు.

అంతకుముందు, ఈ కేసులో బీఎన్‌ఎస్ కొత్త చట్టాల ప్రకారం 105వ సెక్షన్‌కు మార్చారని జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. తదుపరి చర్యల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు పరిశీలించిన హైకోర్టు, కేసులో రెండుసారాల పాటు స్టే విధిస్తూ తాత్కాలికంగా జగన్‌కు ఊరట కల్పించింది. గత నెలలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటించగా, సింగయ్య అనే వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి మృతి చెందాడు. మొదట కాన్వాయ్ వాహనం ఢీకొట్టినట్టు వార్తలొచ్చినప్పటికీ, తర్వాత జగన్ కారు కిందే వృద్ధుడు మృతిచెందినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జగన్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును రద్దు చేయాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు రెండు వారాల స్టే విధించింది.

Read More : ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్…

One thought on “సింగయ్య మృతి కేసులో జగన్‌కు హైకోర్టు ఊరట…

Comments are closed.