కేటీఆర్ ఆగ్రహం – రేవంత్‌పై తీవ్ర విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధి దిశను దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు. హైదరాబాద్ వాసులకు అందిస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని కేటీఆర్ ఆరోపించారు. “హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత తాగునీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే. ఇప్పటికే 420 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేక చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ పథకానికి గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని కేటీఆర్ అన్నారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని కేటీఆర్ పేర్కొన్నారు. “రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ ప్రభుత్వం, ఇప్పుడు నగరంలో ఉచిత తాగునీటి పథకాన్నీ రద్దు చేస్తే ప్రజలు క్షమించరు” అని హెచ్చరించారు.

హైడ్రా వంటి నిర్ణయాలతో తీరని నష్టం కలిగించారని, రాజధానిలో మళ్లీ కరెంట్ కోతలు, దెబ్బతిన్న రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. “ఉచిత నీటి పథకానికి గండికొడితే హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుతారు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read More : బీసీ రిజర్వేషన్ల ధర్నాలో పాల్గొననున్నారు