డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు జరగడం ద్వారా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ ఘనతతో భారత్ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది.
వేగంగా పెరుగుతున్న వినియోగం
గత నెలల్లో యూపీఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. జూన్‌లో రోజువారీ సగటు లావాదేవీలు 62.8 కోట్లుగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఈ సంఖ్య 70 కోట్లకు చేరింది. జూలై నెలలో మొత్తం 1,947 కోట్ల లావాదేవీలు జరిగి, వాటి విలువ రూ.25.1 లక్షల కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 35 శాతం, విలువలో 22 శాతం వృద్ధి నమోదైంది.
ఎన్‌పీసీఐ లక్ష్యం
భవిష్యత్తులో రోజుకు 100 కోట్ల లావాదేవీలు చేరుకోవడమే లక్ష్యమని యూపీఐ నిర్వాహక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. సులభమైన వినియోగ విధానం, వ్యాపారుల మద్దతే ఈ వృద్ధికి ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల వినియోగదారులు, 6.5 కోట్ల వ్యాపారులు యూపీఐ వాడుతున్నారు.
ఛార్జీల వసూళ్లు ప్రారంభం
ఇక యూపీఐ ఉచిత సేవలపై చర్చ కూడా మొదలైంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఆగస్టు 1 నుంచి పేమెంట్ అగ్రిగేటర్లపై ఛార్జీలు విధించడం ప్రారంభించింది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి సంస్థల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. వినియోగదారులపై నేరుగా భారం పడకపోయినా, ఈ నిర్ణయం పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఆర్థిక లెక్కలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Read More : ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరు

One thought on “యూపీఐ రికార్డు సృష్టి”
Comments are closed.