మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆరేళ్లు గడిచినప్పటికీ న్యాయం దక్కలేదని కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందులలోని సమాధుల తోటలో తన తండ్రి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన సునీత, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
సునీతా రెడ్డి మాట్లాడుతూ, “మా తండ్రి హత్యకు 6 ఏళ్లు గడచినా న్యాయం జరగలేదు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగతా నిందితులు అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. విచారణ సరిగా జరగడం లేదు, ట్రయల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. మా తండ్రి హత్యపై ఎంత పోరాడినా న్యాయం జరగడం లేదు. ఈ కేసులో నిందితుల కంటే మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందనిపిస్తోంది. న్యాయం కోసం ఎంతకాలమైనా పోరాడుతూనే ఉంటాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణలో స్పష్టత లేకపోవడం, సాక్షులపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సునీత గవర్నమెంట్‌పై సీరియస్ అయ్యారు. సాక్షుల మరణాలు కూడా అనుమానాస్పదంగా మారాయని ఆమె ఆరోపించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేంతవరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా ప్రకటించినా, తరువాత ఇది హత్యగా నిర్ధారణ కావడంతో కేసు హైప్రొఫైల్‌గా మారింది. హత్య కేసులో వివేక కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ కోరగా, హైకోర్టు ఆమోదం తెలిపింది.
కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మరో ఏడుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. అయితే విచారణ ఆలస్యమవుతుండటంపై వివేక కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాడుతున్న వైఎస్ సునీతా రెడ్డి తన తండ్రి హంతకులకు శిక్ష పడేంతవరకు వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. కేసు నడిపే విధానం, సాక్షులపై ఒత్తిళ్లు, విచారణ ఆలస్యం వంటి అంశాలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

One thought on “వైఎస్ వివేక హత్యకేసులో న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాటం చేస్తున్న కుమార్తె వైఎస్ సునీత”
Comments are closed.