కొండా దంపతులు హైకమాండ్‌ను కలిశారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గపోరు మరోసారి ముదిరింది. ఈ పరిణామాలు ఢిల్లీ హైకమాండ్ దృష్టికి చేరగా, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి గురువారం హైదరాబాద్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన సమస్యలపై తన వాదనలతో కూడిన నివేదికను ఆమెకు సమర్పించారు.

ఈ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనకు ఒక రోజు ముందు జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, తాను మంత్రిగా బాధ్యతగా పనిచేస్తున్నానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖకు సంబంధించిన ఫైళ్లను ఎవరైనా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. కుమార్తె కొండా సుశ్మిత రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆమెకు తన భవిష్యత్తు నిర్ణయించుకునే హక్కు ఉందని తెలిపారు. కొందరు నేతలు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, కొండా మురళి ఇటీవల వివరణ ఇచ్చినప్పటికీ, పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ మురళి, కాంగ్రెస్‌లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య సురేఖ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు. పరకాల నియోజకవర్గం నుంచి తమ కుమార్తె సుశ్మితను బరిలో దించాలని కొండా దంపతులు భావిస్తున్న నేపథ్యంలో, రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గంతో విభేదాలు పెరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ కొండా దంపతుల భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : వనపర్తి జిల్లాలో హృదయవిదారక ఘటన

One thought on “కొండా దంపతులు హైకమాండ్‌ను కలిశారు

Comments are closed.