మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు వరదలతో ప్రాణాలు కోల్పోతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “రోమ్ తగలబడుతుంటే నీరో వాయిద్యాలు వాయించినట్టే సీఎం ప్రవర్తన కనిపిస్తోంది” అని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజాపేట గ్రామంలో వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన సత్యం కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని అన్నారు. “రాజాపేటలో ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకుని కరెంట్ స్తంభంపై నాలుగు గంటలపాటు సహాయం కోసం ఎదురుచూశారు. కలెక్టర్ సహా అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదు. చివరికి స్తంభం కూడా కొట్టుకుపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసరాల కోసం హెలికాప్టర్ పంపివుంటే ప్రాణాలు కాపాడగలిగేవారని, కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించలేదని ఆయన విమర్శించారు. “మంత్రులు హెలికాప్టర్లు అత్యవసరాలకే వాడాలని చెబుతారు, కానీ అధికార పార్టీ నేతలు వాటిని పెళ్లిళ్లకూ, రాజకీయ ప్రయాణాలకూ వాడుతున్నారు” అని హరీశ్ రావు ఆరోపించారు.
వరద ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు లేక వర్షపు నీటినే తాగుతున్నారని, ధూప్ సింగ్ తాండా వంటి అనేక గ్రామాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని కోరారు.
Read More : సిరిసిల్ల వరద ప్రాంతంలో కేటీఆర్–బండి సంజయ్ ఆప్యాయ కలయిక

One thought on “వరదలపై సీఎం పై హరీశ్ రావు ఘాటైన విమర్శలు”
Comments are closed.