వనపర్తి జిల్లాలో హృదయవిదారక ఘటన

వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు చేతిలో హత్యకు గురైన దారుణ ఘటన హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. కేవలం బెట్టింగ్ డబ్బుల కోసమే 19 ఏళ్ల కుమారుడు తండ్రిని కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హనుమంతు (37) తన భార్య, ఇద్దరు కుమారులు రవీందర్ (19), సంతోష్‌తో కలిసి జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్‌నగర్‌కు వలస వచ్చాడు. హనుమంతు మేస్త్రీగా పనిచేస్తుండగా, అతని పెద్ద కుమారుడు రవీందర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత జులాయిలా తిరుగుతూ, బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు వేసి పోగొడుతూ ఉంటూ పాలుపోశాడు. ఇటీవల అప్పులు పెరగడంతో, హనుమంతు తన సొంతూరులోని భూమిని తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తీసుకువచ్చాడు. ఇందులో రూ.2.5 లక్షలు తన అకౌంట్లో వేయించుకున్న రవీందర్, ఆ మొత్తాన్ని కూడా బెట్టింగ్‌లో పెట్టి పూర్తిగా కోల్పోయాడు. డబ్బుల గురించి అడిగిన తండ్రికి, “స్నేహితుడు తీసుకున్నాడు, త్వరలో ఇస్తాడు” అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

తండ్రి హనుమంతు తరచూ బుజ్జగిస్తూ, బెట్టింగ్‌ ఆపాలని హితవు పలికే ప్రయత్నం చేశాడు. అయితే రవీందర్ మాత్రం ఈ మాటలు విని భరించలేకపోయాడు. చివరకు తన తండ్రినే మోసం చేసి హత్య చేయాలని కూట్ర పన్నాడు. జూలై 2వ తేదీ మంగళవారం మధ్యాహ్నం “డబ్బులు తీసుకొస్తున్న స్నేహితుడు వస్తున్నాడు, ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంది” అంటూ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తండ్రిని తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి కళ్లకు గంతలు కట్టి, మాటల్లో పెట్టి ముందుగా తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావంతో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఒకవైపు బెట్టింగ్ మాయ, మరోవైపు కుటుంబ విలువల క్షీణత ఈ దుర్మార్గానికి దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Read More : జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడి మృతి

One thought on “వనపర్తి జిల్లాలో హృదయవిదారక ఘటన

Comments are closed.