ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణలో విద్యా మరియు వైద్య రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నగరంలో ట్రాఫిక్కు ఆటంకం లేకుండా నాగపూర్–అమరావతి జాతీయ రహదారి పక్కనే భవన సముదాయం నిర్మించబడుతుందని పేర్కొన్నారు.
పేదలకు వైద్యం – ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తుందని, పాలకుల కోసమో, ధనవంతుల కోసమో కాదు అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రూ.5,950 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన విషయాన్ని ప్రస్తావించిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. గాలికి వదిలేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులను క్లియర్ చేస్తామన్నారు.
హెల్త్ సర్వీసుల విస్తరణ
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఖమ్మంలో రూ.130 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
త్వరలో ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్, వ్యాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామ స్థాయిలో అంబులెన్స్ సదుపాయాలు, నర్సింగ్ కాలేజ్, మిడ్ వైఫరీ కోర్సులు కూడా ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Read More : రికవరీ వ్యాన్ డ్రైవర్ మృతి, మరొకరు గాయపడిన ఘటన.

One thought on “పేదలకోసం మెరుగైన వైద్యసేవల దిశగా మరో అడుగు”
Comments are closed.