పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు 202 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
ముందు ప్రభుత్వం కాలంలో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పనులను మరలా ప్రారంభించి వేగంగా పూర్తిచేస్తోందన్నారు. జనవరి 18న రూ.990 కోట్ల వ్యయంతో కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.
ఈ నెలాఖరులోగా మూడవ కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా కొనసాగించేందుకు మే నెలలో ఎగువ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2024 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇచ్చారని, దానికి అనుగుణంగా పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
డయాఫ్రం వాల్ పూర్తయ్యేలోపు గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించామని, గ్యాప్-2 వద్ద పనులను నవంబర్ 30 నాటికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ లోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వం కాలంలో లెఫ్ట్ కెనాల్ పనులకు తగిన నిధులు విడుదల కాలేదని, కూటమి ప్రభుత్వం రూ.1200 కోట్లతో టెండర్లు పిలిచి పనులను ప్రగతిపథంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గోదావరి నదిలో వరద నీటిని లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తరలించనున్నట్లు వివరించారు.
Read More : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల

2 thoughts on “పోలవరం డయాఫ్రం వాల్ పనులు వేగవంతం — 2027లో పూర్తిచేసే లక్ష్యం”
Comments are closed.