పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు – 100 మంది ముష్కరులు హతం

ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్టు కేంద్రం ప్రకటించింది. గురువారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్టు తెలిపారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పేర్కొన్నారు.

రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న కారణంగా పూర్తి వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు. భారత్ ఉద్దేశం ఉద్రిక్తతలను పెంచడం కాదని, అయితే పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు కఠినంగా స్పందిస్తామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెప్పారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ భేటీలో మాట్లాడుతూ, దేశ భద్రత కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ఐక్యతతో ముందుకెళ్దామని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయని, ఈ అంశంలో రాజకీయాలకు తావులేదని అన్నారు.

గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందినట్టు సమాచారం.

Read More : పాక్ ఆరోపణల మేరకు భారత దాడి

One thought on “పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు – 100 మంది ముష్కరులు హతం

Comments are closed.