కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా: KTR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా నీరసం ఉండటంతో గురువారం సాయంత్రం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సలహా మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం, కేసీఆర్‌కు ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్‌ స్థాయిలు ఎక్కువగా ఉండగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రే హెల్త్ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు, పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమేనని తెలిపారు. తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ట్వీట్‌ ద్వారా తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

read more : కేసీఆర్ అస్వస్థత – యశోద ఆసుపత్రిలో చికిత్స