తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం మహిళలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని వెల్లడించారు. కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, “ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2,500, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ వాగ్దానాలు ఏమయ్యాయి? పింఛన్ల పెంపు విషయమేం జరిగింది? సీఎం అసెంబ్లీలో కేసీఆర్‌కు సవాల్ చేస్తే, మేము కూడా చర్చకు సిద్ధమే.. మీరే ఇప్పుడు కమాండ్ కంట్రోల్‌కు రండి” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రాజకీయ నాటకాలు చేస్తున్నారని విమర్శించిన కవిత, “ఆయన మోసాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీపై కవిత అభిప్రాయపడి, ఆ హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల లేని ఎన్నికలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించిన కవిత, ఈ కార్యక్రమాన్ని బీసీ సామాజిక వర్గాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందడుగు వేయాలని ఆమె సూచించారు.
పురుషోత్తపట్నంలో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కవిత, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని పేర్కొన్నారు.
Read More : ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలి: MP

One thought on “హామీలపై చర్చకు సిద్ధమంటూ హెచ్చరిక”
Comments are closed.